మనుషులు చనిపోవచ్చు కానీ.. వాళ్లు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. అందులోనూ స్నేహం గురించి, దాని గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్ననాటి నుంచి.. చివరి క్షణం వరకు ప్రతీ ఒక్కరి జీవితంలో స్నేహితుని పాత్ర ప్రత్యేకమైనది. అయితే.. బ్రతికున్నప్పుడు సాటి వ్యక్తి కష్టసుఖాల్లో నేనున్నా అన్న భరోసా ఇవ్వలేని బంధువుల కంటే.. అన్నింటా నీవెంటే ఉంటానంటూ ధైర్యాన్నిచ్చే స్నేహితులు ఎప్పుడూ స్పెషలే. అయితే.. ఆ స్నేహం బతికున్నన్ని రోజులే కాదు.. చనిపోయిన తర్వాత కూడా ఉటుందని నిరూపించారు ఈ స్నేహితులు. స్నేహితుడు మరణించినా అతని జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నారు. చనిపోయిన తమ స్నేహితుని పుట్టినరోజును అతని సమాధి వద్ద నిర్వహించి బాధాతహృదయంతో నివాళులు అర్పించి.. వారి ఫ్రెండ్‌షిప్‌ను నిరూపించుకున్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం మండల కేంద్రానికి చెందిన యండీ మోహీన్ ఖాన్.. గత సంవత్సరం భీమారం నుంచి కొడిమ్యాల వెళ్తుండగా రోడు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జరిగి సంవత్సరం గడిచినా.. మోహిన్ జ్ఞాపకాలు అతని మిత్రులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ రోజు మోహిన్ పుట్టినరోజు కావడంతో ఎంతో బాధతో తన స్నేహితునికి పుట్టినరోజు వేడుకలు జరిపించాలనుకున్నారు. తమ స్నేహితుడు తమ మధ్య లేడు అనే భాదతోనే.. మోహిన్ సమాధి వద్ద పుట్టినరోజు వేడుకలు జరిపారు. గ్రామంలో ఫ్లేక్లీలు ఏర్పాటు చేసి.. సమాధి వద్ద స్వీట్లు, కేకు కట్ చేశారు. తమ స్నేహితుడు తమ మధ్య లేడన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఆస్నేహితులు చెప్పుకొచ్చారు. అందుకే తన స్నేహితుడు మృతి చెందినా.. తనకు ఈ పుట్టినరోజు వేడుకలు జరిపామని చెప్పుకొచ్చారు.