పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే.. మహిళా రిజర్వేషన్ బిల్లు తన వల్లే పార్లమెంటులో ప్రవేశబెడుతున్నారంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ కవిత ఎక్కడ ఉద్యమం చేశారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి లేదని తండ్రిని అడగలేని కవిత.. మహిళా బిల్లు కోసం పోరాడనని.. తన వల్లే సాధ్యమైందని చెప్పుకోవటం విడ్డూరమన్నారు. ఆమె చెప్పేవన్ని నమ్ముకుంటే పోతే చంద్రయాన్ రాకెట్ కూడా తానే చేసిన అని కవిత చెబుతుందంటూ ఎద్దేవా చేశారు. మహిళా బిల్లు అనేది కాంగ్రెస్ మానస పుత్రిక అని మహేశ్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అవినీతి సామ్రాట్ కేసీఆరేనని.. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకున్న రికార్డు ఆయనకే దక్కుతుందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో బినామీ చట్టాన్ని అమలు చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. హోంమంత్రి అమిత్ షా తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టమన్నారు. బ్రిటిష్ వారి నీతినే బీజేపీ కూడా అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రజలను విడదీసి పాలించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజా నాయకుడని.. కాంగ్రెస్ పార్టీ నాయకుడని తెలిపారు. గుండు సూది కూడా తయారు కాని దశ నుంచి రాకెట్ పంపించే స్థాయి వరకు భారత్ ఎదగడం వెనుక నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 1981లో పుట్టిన బీజేపీకి చరిత్ర మాట్లాడే అర్హత లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రజాకార్ సినిమాతో తెలంగాణలో ఏమీ చేయాలేరని తోసి పుచ్చారు. రజాకార్లు, నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ లేవన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని.. ఇలాంటి ఎన్ని రెచ్చగొట్టే సినిమాలు తీసినా శాంతిభద్రతలను దెబ్బతీయలేరని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.