ఏళ్లుగా పోరాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. మంత్రి సత్యవతి రాథోడ్ కవిత పోరాటాన్ని కొనియాడారు. జనాభాలో సగమైన తమకు చట్టసభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటం వృథాకాలేదన్నారు. కవిత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం శుభపరిణామం అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్ పార్టీ కృషి ఉందని చెప్పుకొచ్చారు. మహిళా బిల్లుపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో సగం నినాదం అమలు కానుందంటూ మంత్రి చెప్పుకొచ్చారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి లేఖ రాసి సీఎం కేసీఆర్ పెద్ద పాత్ర పోషించారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నిర్విరామ పోరాటం చేశారని.. చివరికి గెలుపు సాధించామన్నారు. 33 శాతం రిజర్వేషన్ అమలుతో దేశ వ్యాప్తంగా మహిళలకు గొప్ప అవకాశం దక్కనుందన్నారు. గతంలోనూ లోక్‌సభలో ఎంపీగా ఎమ్మెల్సీ కవిత అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మహిళా సాధికారతపై గళం విప్పిన విషయాన్ని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.
మార్చిలో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయడం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు. కవిత ఒక్క పిలుపుతో దాదాపు 47 రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని కొనియాడారు. పోరాటలకు తలొగ్గే.. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమెదం తెలిపిందని సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు.